Life is not the amount of breaths you take It’s the moments that take your breath away

This is again from Ganesh Ravuri garu, film critic. Earlier I had used his critic review of Manam in my blog as I was awestruck with it and I have informed him too. I hope he would not mind using this piece again in my blog.

Life is not the amount of breaths you take

It’s the moments that take your breath away” – Hitch

image.jpeg‘హిచ్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమాలో ఒక డైలాగుంటుంది… ‘జీవితమంటే ఎన్నిసార్లు ఊపిరి తీసుకున్నామని కాదు, ఊపిరి ఆగిపోయేలా చేసిన క్షణాలు ఎన్ని ఉన్నాయని!’ ఈ మాటలకి ఒక సినిమా రూపమిస్తే అది ‘ఊపిరి’ అవుతుంది. ‘సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనే క్యాప్షన్‌కి తగ్గట్టే ఈ సినిమా ఒక గొప్ప సంబరం, ఒక మధురానుభూతి, ఒక మర్చిపోలేని జ్ఞాపకం!

తెరపై చూస్తున్నది నాగార్జున అని తెలుసు, ఆయన నడవగలడని, జీవితాంతం కదల్లేని పరిస్థితిలో అయితే లేడని, హాయిగా ఉన్నాడని మనకి తెలుసు. అయినప్పటికీ తెరమీద నాగార్జున కాకుండా, దురదృష్టవశాత్తూ జీవిత కాలం చక్రాల కుర్చీకి మాత్రమే పరిమితమయ్యే అపర కోటీశ్వరుడు విక్రమాదిత్య మాత్రమే మనకి కనిపిస్తాడు. కరిగిపోయిన అతని కలలు, అనంతమైన చీకటి నిండిన అతని అంతరంగం మనకి కనిపిస్తాయి. అందుకే ఊపిరి అందని స్థితిలో అతను ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటే, సాయం చేయడానికి ఎవరూ రాని పరిస్థితి వుంటే ‘అయ్యో పాపం’ అంటూ అల్లాడిపోతాం.

‘ఎప్పటికీ నాతో ఉండిపోతావా?’ అని తనకి దొరికిన ‘తోడు’ని అడిగిన అతనే అవతలి వ్యక్తికీ ఒక జీవితం వుందని, ఎప్పటికీ చక్రాల కుర్చీ తోస్తూ బతకలేడని గ్రహించి తన సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లిపొమ్మంటే, చిగురించిన ఆశలన్నీ శిధిలమైపోతే అతను పడే వేదనని మనం అనుభవిస్తాం. కదల్లేని స్థితిలోంచి మళ్లీ ఎగరగలిగిన అతని ఆనందాన్ని, జీవితం మీద విరక్తి చెందిన సమయంలో అతనికి దొరికే ఓదార్పుని.. ఇలా దేనికైనా సరే గుండె చప్పుళ్లతోనే చప్పట్లు చరుస్తాం. ఉబికి వస్తోన్న కన్నీటితోనే ఆ పాత్రకి, ఆ నటుడికీ నీరాజనాలు అర్పిస్తాం.

హేట్సాఫ్‌ టు నాగార్జున గారు. ఆయన ఈ సినిమా చేయనంటే ఊపిరి తీసి ఉండేవాడిని కాదని వంశీ పైడిపల్లి చెప్పాడు. నిజంగా నాగార్జున లేకపోతే ‘ఊపిరి’ లేదు. తెలుగు సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే ఎన్నో చిత్రాలని చేసిన నాగార్జున నిజంగా మన తెలుగు చిత్ర సీమకి దొరికిన వరం. ‘మనం’ ఇలాంటి ఆణిముత్యాలని చూడగలుగుతున్నామంటే ఇలాంటి ప్రయత్నాలకి ఆయనిస్తోన్న ప్రోత్సాహమే కారణం.

కార్తీని ఎంచుకోవడం ద్వారా ఈ కథకి ఈ చిత్ర రూపకర్తలు ‘ఊపిరి’ అందించారు. ఎంతో సహజంగా, ఇలాంటి స్నేహితుడూ మనకీ ఉంటే బాగుండని ఫీలయ్యేంతగా కార్తీ అద్భుతంగా అభినయించాడు. అతని కెరియర్‌లో ఇదో మణిపూసలా ఎప్పటికీ నిలిచిపోతుంది.

‘ది ఇన్‌టచబుల్స్‌’ సినిమాని వంశీ పైడిపల్లి రీమేక్‌ చేయబోతున్నాడంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. బృందావనం, ఎవడు లాంటి మసాలా సినిమాలు తీసే దర్శకుడు అలాంటి క్లాసిక్‌ని రీమేక్‌ చేసే సాహసానికి ఎలా ఒడికడుతున్నాడని అనుకున్నారు. ఏదైనా బాగా నచ్చినప్పుడు దానిని ఆరాధించి వదిలేయాలని, అంతే తప్ప అలాంటిదాన్ని మరోటి తీయాలని అనుకోరాదని అంటుంటారు. కానీ ఒక దానిని మనం నిజంగా ప్రేమిస్తే, దానిని పునఃసృష్టించినపుడు కూడా అంతే అందంగా తీర్చిదిద్దవచ్చని, ఆ ఆత్మ ఎటూ పోకుండా ఈ కొత్త సృష్టిలోను దానిని ప్రతిష్టించవచ్చునని వంశీ పైడిపల్లి నిరూపించాడు.

రీమేక్‌ సినిమా అంటే ఉన్నదానిని యథాతథంగా తీసేయడం కాదు. ఆ సినిమా తాలూకు భావోద్వేగాలని అనుభవించి, దాని తాలూకు ఆత్మని పట్టుకోగలిగితే తప్ప ఆ ఫీల్‌ రాదు. ముఖ్యంగా ఇలాంటి ఫీల్‌గుడ్‌ సినిమాల్ని రీమేక్‌ చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఫ్రెంచ్‌ క్లాసిక్‌ని రీమేక్‌ చేయాలని అనుకోవడమే కాకుండా దానికి పరిపూర్ణ న్యాయం చేయడంలో వంశీ పైడిపల్లి విజయవంతమయ్యాడు. ఆ సినిమాలోని ప్రతి మూమెంట్‌ని మిస్‌ అవకుండా, తను జోడించిన మూమెంట్స్‌తో కథ అందం చెడకుండా చక్కని బ్యాలెన్స్‌ పాటిస్తూ మరపురాని ఎమోషనల్‌ జర్నీ చేసివచ్చిన ఫీలింగ్‌ అందించాడు.

మనకి బాగా నచ్చిన సినిమా చూస్తున్నప్పుడు అది ఎంత సేపటికీ పూర్తి కాకపోతే బాగుండనిపిస్తూ ఉంటుంది. బహుశా ‘ది ఇన్‌టచబుల్స్‌’ని అతిగా ప్రేమించేసిన వంశీ పైడిపల్లి తన సినిమా కూడా పూర్తి కాకుండా రన్‌ అవుతూనే ఉండాలని అనుకున్నాడో ఏమో.. కాసింత ఎక్కువసేపు నడిపించాడు. విక్రమాదిత్య, శ్రీను (కార్తీ) జీవితాల్లోకి కాస్త ఎక్కువగా తొంగి చూసాడు. వాళ్లకి సంబంధించిన డీటెయిల్స్‌ అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ ఇచ్చాడు.

అంత అందమైన చందమామకి కూడా మచ్చలున్నప్పుడు ఒక సినిమాకి చిన్నపాటి లోపాలుండడంలో ఏముందిలెండి. దీన్నో సగటు సినిమాగా చూడకుండా, ఇద్దరి వ్యక్తుల జీవిత కథగా చూస్తే (ఫ్రెంచ్‌ సినిమాకి నిజ జీవితంలో జరిగిందే స్ఫూర్తినిచ్చింది) ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు. ఒక సినిమా చూసేసి వచ్చాక కూడా ఆ పాత్రలు మనతోనే ఉన్నాయంటే, సినిమా అయిపోయాక కూడా వాళ్లిప్పుడు ఏం చేస్తూ ఉండి ఉంటారనే ఊహ తలపులోకి వచ్చిందంటే ఒక సినిమాకి అంతకంటే పెద్ద అఛీవ్‌మెంట్‌ ఏముంటుంది? అన్ని విజయాలనీ బాక్సాఫీస్‌ లెక్కలతోనే కొలవలేం.. ఇలాంటి కొన్ని సినిమాల్ని తూకమేయడానికి అవి మిగిల్చిన అనుభూతులే కొలమానం.

ప్రతి నటీ నటుడు, ప్రతి సాంకేతిక నిపుణుడు ప్రేమించి చేసిన సినిమా ఇది. ఇలాంటి మరెన్నో ప్రయత్నాలకి ఊపిరినిచ్చేంత స్థాయిలో ప్రేక్షకులు దీనికి ఊపిరినూదాలి.

ఊపిరి ఆడకుండా చేసే సినిమాలు వస్తుంటాయి, ఊపిరి ఆగిపోతే బాగుండనిపించే సినిమాలు చాలానే ఉంటాయి… ఊపిరి ఉండగా చూడాల్సిన సినిమా అనిపించే ‘ఊపిరి’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. మిస్‌ కాకండి!

బోటమ్‌ లైన్‌: సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌!

– గణేష్‌ రావూరి

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s