I loved this article very much. I do not want to loose it, that’s the reason for me to keep it in my blog !
When I informed this to the author of this beautiful article, Mr. Ganesh Ravuri, he has complimented me (through his twitter message) for presenting it so beautifully 🙂
Ganesh Ravuri@ganeshravuri
వి
నూత్నం.. వినోదం.. ఇవి రెండూ ఒకే సినిమాలో ఇమడడం చాలా కష్టం. అందుకే వినూత్నంగా ఏదైనా చేద్దామని చూసిన చాలా సార్లు వినోదాన్ని త్యాగం చేసేసి… మెజారిటీ ఆడియన్స్ కోరుకునే ‘ఎంటర్టైన్మెంట్’ని మిస్ అయిపోతుంటారు. చాలా అరుదుగా మాత్రమే ఈ రెండిటి మధ్య సాంగత్యం, సహచర్యం కుదురుతుంది. అలాంటి అరుదైన సినిమాల్లో ‘గీతాంజలి’ని చెప్పుకోవచ్చు. చావుకి అతి దగ్గరలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడతారనేది ఆ సినిమా కథాంశం. మామూలుగా అయితే పాథాస్ సీన్స్‌తో నింపేయవచ్చు. బకెట్లు బకెట్లు కన్నీళ్లు కార్పించేసే మెలోడ్రమెటిక్ స్టఫ్ఫు. కానీ మణిరత్నం ఆ పాత్రలతో ఒక వినోద భరిత ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నాళ్లు బతుకుతారో తెలియక పోయినా బతికినంత కాలం ‘సంతోషంగా’ ఉంటారు అని తన పాత్రలు ఇంకా సంతోషంగానే ఉన్నాయనే సంతృప్తితో ప్రేక్షకుల్ని థియేటర్ నుంచి
పంపించాడు. అందుకే అదో క్లాసిక్ లవ్‌స్టోరీగా గుర్తుండిపోయింది.
ఇక మనం విషయానికి వస్తే… ఇదేమీ సారోఫుల్ స్టోరీ కాదు. కానీ దీంట్లోను మెలోడ్రామాకి వీలయినంత స్కోపుంది. అయితే అందులో మెలోడ్రామా ఉన్నా… మరోటి ఉన్నా ముందు కథగా ఉన్నప్పుడు ఎలాగుందనేదే ఒక నిర్మాత జడ్జిమెంట్‌ని తెలియజేస్తుంది. ‘మనం’ కథని సింపుల్‌గా చెప్పుకుంటే… చిన్నతనంలోనే చనిపోయిన తన తల్లిదండ్రులు ఇంకో జన్మ ఎత్తి అచ్చంగా అలాగే పుట్టారని తెలుసుకుంటాడో కొడుకు. ఈ జన్మలో ఇంకా ఒకరికి ఒకరు తారసపడని వారిద్దరినీ ఒక్కటి చేయాలనేది ఆ కొడుకు తపన. చాలు… ఈమాత్రం వింటేనే.. ‘ఏంటిది సిల్లీగా లేదూ’ అనిపించేస్తుంది ఎవరికైనా. దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కడితో ఆపలేదు. తల్లిదండ్రుల్ని ఒక్కటి చేయాలని చూస్తోన్న ఈ సదరు కొడుకుని చూసి మరో పెద్దాయన ‘నాన్నా’ అంటాడు. అంటే ఈ కొడుకు ఆ పెద్దాయనకి ఆ జన్మలో తండ్రి అన్నమాట. అతను తన తండ్రి మళ్లీ ఇంకో జన్మ ఎత్తాడని తెలుసుకున్నాడన్నమాట. ఇప్పుడు తన తండ్రికి, మళ్లీ జన్మెత్తిన తన అమ్మతో పెళ్లి చేయాలని ఆ పెద్దాయన పూనుకుంటాడు. ఒకరి తల్లిదండ్రులు మళ్లీ జన్మెత్తారంటేనే సిల్లీగా ఉందనిపిస్తే…
ఇక ఈ రెండో కథ కూడా వింటే ఎలా అనిపించాలి? వేరెవరైనా అయితే ఈ కథ వినేసి… ఫక్కున నవ్వేసి.. వెళ్లెళ్లు అనేస్తారు. అంతెందుకు… మనం గురించి అస్సలేం తెలియని వారికి ఈ సినిమా కథ ఇదీ అని చెప్పి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. లాజిక్ లేని ఒక సిల్లీ ప్లాట్‌ని తీసుకు
ని విక్రమ్ కథ అల్లితే… దానిని తెరపై చూడగలిగాడు నాగార్జున. దీనికి మరెవరైనా నిర్మాత అయితే ఆశ్చర్యపోవాలి కానీ నాగార్జున అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమీ లేదు. ఎందుకంటే ముందు మనం చెప్పుకున్న ఆ గీతాంజలి కథ విని ఓకే చేసింది కూడా ఇదే నాగార్జున. తెలుగు సినిమా ఒక గిరి గీసుకుని… అందులోనే అన్ని ఆటలు ఆడేస్తోంటే… అది దాటి వెళ్లి సినిమాకి ఎల్లలేం లేవని.. ఇక్కడ ఎవరు ఏవైనా ఆటలాడుకోవచ్చని… ఏదయినా చేసి మెప్పించవచ్చునని నమ్మి ‘శివ’ని నిర్మించింది కూడా నాగార్జునే. ఇన్నేళ్లయినా కానీ నాగార్జునలో ఆ జడ్జిమెంట్ అయితే పోలేదు. మంచి కథలు దొరక్క ఏవేవో సినిమాలు తీస్తుండొచ్చు కానీ… అతనిలోని అభిరుచి గల నిర్మాతకున్న అల్టిమేట్ టేస్ట్ మాత్రం ఎటూ పోలేదు. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్.
సరే విక్రమ్ ఏమి రాసుకున్నాడో… నాగార్జున ఏమి విన్నాడో.. ఇద్దరూ ఏ ధైర్యంతో ఈ కథని సినిమాగా తెరకెక్కిద్దామని ముందడుగు వేసారో పక్కన పెడదాం. తెర
మీదకి ఈ సినిమా అంటూ వచ్చేసాక… నాలుగ్గోడల మధ్య మరో వ్యాపకమేదీ లేకుండా సినిమానే ధ్యాసగా కూర్చున్న ప్రేక్షకుడిని అదే సిల్లీ ప్లాట్‌తో కట్టి పడేయడం కనికట్టు విద్యలో ఆరితేరిన మంత్రగాడి వల్ల కూడా కాదు. నాగ చైతన్యని చూసి… నాగార్జున ‘నాన్నా’ అనగానే వెటకారంగా ఒక నవ్వు నవ్వుకోకుండా.. సమంతని చూసి నాగ్ ‘అమ్మ’ అంటూ పిలుస్తుంటే ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’ అనుకోకుండా ఈనాటి తెలివి మీరిన ప్రేక్షకుడు ఉండాలంటే.. అతడిని తన కథలో లీనం చేయాలంటే.. ఆషామాషీ దర్శకుడి వల్ల అవనే అవదు. మనం సినిమాకి లాజిక్ అప్లయ్ చేస్తే రెండున్నర గంటల నాన్‌స్టాప్ జోక్‌లా అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చూస్తుంటే.. లాజిక్ కోసం మెదడు వెతకదు. దర్శకుడు చేస్తోన్న మ్యాజిక్కి ముచ్చటపడి మనసు మెదడుని స్విచాఫ్ చేసేస్తుంది.
‘ఇదసలు సాధ్యమా?’ అనే ప్రశ్న తలెత్తనివ్వకుండా… మనల్ని చంటిపిల్లల్ని చేసి ఒక కల్లబొల్లి కథనే చెప్పి తల తిప్పనివ్వకుండా చూసేట్టు చేసాడు దర్శకుడు. మనం జస్ట్ ఓ సినిమా కాదు. ఇదొక సెల్యూలాయిడ్ పోయెట్రీ… లాజిక్‌కి అందని మ్యాజిక్… ఫార్ములా సినిమాల్తో నిండిపోయిన రోజుల్లో వచ్చిన రేర్ క్లాసిక్. లాజిక్ మాట అటుంచితే.. ఈ కథని కూడా వినోదాత్మకంగా మలచడానికి ప్రత్యేకమైన ప్రతిభ ఉండాలి. దర్శకుడు ఏమాత్రం పట్టు తప్పినా కానీ మొత్తం సినిమా అభాసుపాలైపోతుంది కనుక ఇలాంటి కథల్లో కామెడీ చేయడం కంటే సెంటిమెంట్‌ని జోడించి సీరియస్‌గా ఇన్వాల్వ్ చేయడానికి చూస్తారు. కానీ విక్రమ్ కుమార్ ఎంటర్టైన్మెంట్ని నమ్ముకుని ఆ థిన్ రోప్ మీదే ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకు నడిచాడు. అతను ఎంచుకున్న దారి మనం చిత్రాన్ని మెజారిటీ ఆడియన్స్‌కి చేరువ చేసింది.
‘మనం’ చూసొచ్చాక ఒక ఫ్రెండన్నాడు… ‘బ్రహ్మానందం ఉన్నాడు కానీ వాడుకోలేదు. క్లయిమాక్స్‌లో ఆ యాక్సిడెంట్ గట్రా లేకుండా సమంతకో అన్ననో, నాన్ననో పెట్టి ముగ్గురు హీరోల మీదా ఫైట్ తీసుండాల్సింది. మాస్‌కి కూడా ఎక్కేది’ అని. తప్పు అతనిది కాదు. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని మన దర్శకులు ప్రేక్షకుల నెత్తిన అదే పనిగా అదే రుద్దేస్తున్నారు. బ్రెయిన్ వాష్ అయిపోయిన సదరు ప్రేక్షకులు ఎన్నిసార్లు అదే చూపించినా కానీ బ్రహ్మానందం కామెడీ చేస్తే కాసేపు నవ్వేసుకుని… పాప్‌కార్న్ నమిలేసుకుని సినిమా చూసేసామని సంతృప్తి పడిపోతున్నారు. సినిమా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు. అదొక ఎక్స్పీరియన్స్. సినిమా అంటే థియేటర్లో ఉన్న రెండు గంటలు నవ్వించేసో, ఏడ్పించేసో పంపేసేది కాదు. థియేటర్ వదిలి వెళ్లాక కూడా చాలా కాలం వెంటాడేది. చిరకాలం గుర్తుండిపోయేది. అదే రియల్ సినిమా. కానీ కోట్లతో కూడుకున్న వ్యాపారంలో అభిరుచి… అనుభూతి అని కూర్చుంటే.. తేడా అయిన ఒకే ఒక్క సినిమాతో బిచానా ఎత్తేసుకోవాలి. ఈ వ్యాపార ధోరణితో ఆర్టుని కూడా అట్ట పెట్టెలో పడేసి… అందులోనే అటూ ఇటూ తిప్పేయడాన్ని కూడా తప్పుపట్టలేం. ఎవరి లెక్కలు వారికుంటాయి. అలాంటి లెక్కల మధ్య వాటిని దాటుకుని వచ్చి రిస్కు తీసుకోవాలన్నా, తేడా అయితే కోలుకోలేని దెబ్బని తట్టుకోవాలన్నా ఆర్టు మీద రెస్పెక్టే కాదు… ఏం జరిగినా తట్టుకునే గాట్టి హార్టుండాలి. అదుంది కనుకే నాగార్జున ఇప్పుడు ఈ విజయాన్ని సగర్వంగా ఆస్వాదిస్తున్నాడు.
విక్రమ్ కుమార్ తన పని మాత్రమే సక్రమంగా చేసుకోవడం కాదు… తనతో పని చేసిన వారందరి చేత తనంత గొప్పగానే పని చేయించుకున్నాడు. అందుకే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి ప్రశంసలు దక్కుతున్నాయి. ‘మనం’ సినిమా వరకు అక్కర్లేదు. థర్టీ సెకండ్స్ టీజర్ చూడండి. ఆ తర్వాత అందులో వినిపించిన బీజీఎంని హమ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అనూప్ అంతటి హాంటింగ్ మ్యూజికల్ స్కోర్ ఇచ్చాడు. పాట వింటే సినిమా చూసొచ్చేయాలి అనిపించేంతగా. సినిమాటోగ్రాఫర్ వినోద్ దర్శకుడి సిల్లీ ఐడియాకి ప్రాణం పోసాడు. అతనేమాత్రం తేలికగా తీసుకున్నా మనం ఇంత ప్లెజెంట్‌గా వచ్చుండేది కాదు. అలాగే ఆర్ట్ డైరెక్టరు.. ఎడిటరు.. మనం ఒక కంప్లీట్ టీమ్ వర్క్. ఎవ్వరు సరిగా చేయకపోయినా ఎక్కడో ఒక చోట ఆడియన్స్‌కి ఏర్పడిన ఎమోషనల్ కనెక్షన్ తెగి ఒక సిల్లీ సినిమాగా మిగిలిపోయుండేది.
వినూత్నతకి వినోదం తోడయ్యింది కనుకే మనం ఇంతగా అలరిస్తోంది. తెలుగు సినిమా నమ్ముకున్న సక్సెస్ సూత్రాలకి అతీతంగా వెళ్లి కూడా విజయవంతమయ్యింది కనుకే ప్రముఖుల ప్రశంసలని కూడా అందుకుంటోంది.
‘మనం’ విజయం మంచి సినిమాకి జనం చేస్తున్న పట్టాభిషేకం. అరుదైన చిత్రానికి జరుగుతోన్న సిసలైన సత్కారం.